Thursday, 3 September 2009

tel11



Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్)

101. లుబ్ధత
1001
ధనము దొంతులందుఁ దగబేర్చి చచ్చును
నిర్దయుండు తినక వ్యర్థముగను.
1002
ధనము మూలమందు దానధర్మములేక
నీచజన్మ మత్తు నిర్దయుండు
1003
కూడబెట్టుకొనుటె గుణమని సత్కీర్తి
బడయలేని జనులు భారమవని.
1004
మిగతఁగాగ జెప్ప దగినది యున్నదే
యిచ్చి మెప్పు వడక జచ్చునతఁడు.
1005
తాను దినక నొరులకైనను బెట్టక
కోటె కున్ననేమి గుణము దాన.
1006
ముగ్ధ పెండ్లిగాక ముదిమిపాలైనటు
లాదుకొనని ధనము బాధలందు.
1007
ఇచ్చి యనుభవింప నిచ్చగొంపని వాఁడు
సిరికిఁ బట్టుకొన్న చీడవురుగు.
1008
నచ్చనట్టి ధనము నగరి మధ్యము నందు
విషఫలమ్ము లిచ్చు వృక్షమట్లు.
1009
ప్రీతిఁదొఱిగి నేది బెట్టక నవినీతి
జేర్చుకొన్న ధనము జేరునొరుల.
1010
పేరువడిన వారు పేదవడగఁ జూడ
కురిసి కురిసి మబ్బు తేరిపియగుట.


102. సిగ్గు
1011
పాపకర్మలందు పాటించుటే సిగ్గు
స్త్రీలకుండునట్టి సిగ్గు వేరు.
1012
కూడు గుడ్డ ప్రాణికోటికి సమమగు
నుత్తములకె లజ్జ యుచితమగును.
1013
ఉదర పోషణార్థముండును జీవులు
సిగ్గు శ్రేష్ఠునందె నిగ్గుదేలు
1014
భూషణమ్ము నడతె బుధవరేణ్యుల కెల్ల
వింతజబ్బు దాని విడచి నడువ.
1015
ఎదిరి నింద తనది విధముగ సిగ్గిలు
వాడె సిగ్గు కెల్లఁ పాదియగును.
1016
మాన రక్షజేయు మహనీయు లద్దాని
విడచి బ్రతుకలేరు వీషమైనా.
1017
ప్రాణ మొసఁగి యైన మానమ్ము రక్షింత్రు
దానియందు దృష్టిఁ దగులువారు.
1018
పరులు సిగ్గుపడెడి పని లాభమని జేయ
వానిఁ జూడఁ సిగ్గు వణకుచుండు.
1019
నీతిఁ దొఱఁగ కులము నిందలపాలౌను
సిగ్గు దొఱఁగ నన్ని క్షీణమగును.
1020
సిగ్గు విడచి తిరుగు జీవులు జీవులా
త్రాటఁ దిరుగు బొమ్మలాటగాని.
 
103. గృహరక్ష
1021
ఎత్తుకొన్న కార్య మెరీతిగా నైన
పూర్తిజేయు నతఁడె పూజ్యుడన్ను.
1022
గట్టి పట్టుదలయు కార్యజ్~ఝతాబుద్ధి
రెండె చాలు గృహము వృద్ధిజెంద.
1023
అహరహమ్ము గృహము నభివృద్ధి గోరెడి
వాని నాద విధయె వచ్చు విధిగా.
1024
అన్ని వచ్చి వడును ననుకూల మగునట్లు
శ్రద్ధయున్న గృహము వృద్ధిజేయ.
1025
తప్పు లేకఁ నింటి గొప్పకుఁ బాల్పడ్డ
చుట్టమనుచు నతనిఁ జుట్టు జగము.
1026
ఇంటి వారి నెల్ల నేక ధాటిగ నేలు
వాని దగును మగత వాస్తవముగ.
1027
సమరమందు దుముకు చందంబు గానుండు
నింటి పెత్తనమ్ము నెత్తుకొనుట.
1028
కార్య గౌరవమ్ము కష్టమ్ము కాలమ్ము
జూచునెడల గృహము శూన్యమగును.
1029
ఇంటి వారికెట్టి యిక్కట్లు బెట్టని
వాని బ్రతుకు దుఃఖ భాజనమ్మె.
1030
ఇంటిమీద పడెడి నిడుముల నడుమిచ్చు
నాధుడింట లేమి నాశనమ్ము.
 
104. వ్యవసాయము
1031
మెడి వెనుక దిరుగు మెదిని సర్వమ్ము
పాటువడిన దాని సాటి యడియె.
1032
దున్ననతని నమ్ముకొన్నది లోకమ్ము
బండి కిరుసు వంటి వాడుగాన.
1033
జీవితంబు దున్ని జీవించు వారిదె
కూలిబ్రతుకు మిగత కొలువులన్ని.
1034
ఇచ్చుగాని నొకరి నిమ్మని యడుగడు
సేద్యమున్న జాలుఁ జేతి నిండ.
1035
హాలికాళి హస్తమాడనిచో నిల్వ
ముక్తవరులకైన శక్తిలేదు.
1036
పంట నీడఁ దనదు ప్రభుని ఛత్రపు చాయ
నన్య నృపులుఁ జూచు హాలికుండు.
1037
తులము మన్ను పావుతులమట్లు జేసిన
నేలకెరువు బెట్ట నేల మరల.
1038
చాలు కన్న నెరువు జలముకన్నఁ గలుపు
కలుపు కన్న కంచె బలము కృషికి.
1039
కయ్యమీద దృష్టిఁ గాపు జూపకయున్న
భర్తప్రేమలేని భార్యవిధము.
1040
బీదనంచు బైరు బెట్టక కూర్చున్న
వాని జూచి క్షేత్ర భామ నవ్వు.


105. దారిద్ర్యము
1041
పేసరికపుసాటి బాధ యేదన్నచో
పేదరికమెగాని వేరుగాదు.
1042
లేమి యనెడు పాపి లేకుండగాఁజేయు
ఇహపరాల రెంట నేరికైన.
1043
పేద యయ్యెనంచు పేర్వడ్డ మాత్రాన
ఇంటి గొప్పదనము మంట గలియు.
1044
గొప్ప యింట బుట్టినప్పటికైనను
లేమిచేత వచ్చు లేసుమాట.
1045
పేదరికము జాలు బాధల నన్నింట
నేకపఱచి సుఖము లేకఁ జేయ.
1046
విషయ మెఱింగినట్టి విద్యాంసునైనను
పేదయైనఁ జూడ రాదరమున.
1047
ధర్మమునకె తగని దారిద్ర్య మబ్బిన
నమ్మయైన జూచు నన్యునట్లు.
1048
నిన్న బడిన బాధ నేడెట్లు బడనంచు
తల్లడిల్లు పేద తలచి దలచి.
1049
కన్ను మూయలేము కటిక దారిద్ర్యన
నిప్పు మీదనైన నిద్రవచ్చు.
1050
సాగలేనివాడు సన్న్యసింప కుంట
నుప్పు బుణము దీర్ప నుండునట్లె.


106. యాచించుట
1051
అడుగఁదగిన వారి నడుగుము లేదన్న
నింద నీకు కాదు పొందు నతని.
1052
అడుగుటైన గాని యందంబుగా నుండు
నీసడింపు లేక నిచ్చువారి.
1053
దాపరికము లేని ధర్మాత్ములను జేరి
యడిగి తినుట గూడ నందమగును.
1054
ఇచ్చినంత గొప్ప యిమ్మని యడుగుట
కలనునైన దాచఁ గానివాని.
1055
దాచ కిచ్చువారు ధరగల రందుకే
యడుగు వారు మరుగు బడుటలేదు.
1056
ఉన్న పేదబాధ లొక్కసారిగ దీరు
దాచకిచ్చు వారి దాపునున్న.
1057
పరిహాసించి తిట్టి పంపక నిచ్చెడి
వారిఁ జూడ నర్ధి గొరుచుండు.
1058
అడుగువారు లేమిఁ దడిగల భూమిపై
ప్రతిమలు తిరుగాడు గతి దలంప.
1059
అడుగువార లపని నదృశ్యునైనచో
విచ్చువారి కీర్తి వచ్చుటెట్లు.
1060
బిచ్చమెత్తఁ దగదు బింకమ్ము గలవాఁడు
వాఁడె దెలియు దాని వాడవాడ.


107. అపరిగ్రహము
1061
మనసు సచ్చియిచ్చు మనుజల కడనైన
నడుగరామి కోటికైన మేలు.
1062
అడిగి దినఁగ జేయ నజుడైన గానిమ్ము
తిరిగి తిరిగి చెడుత దిరిపమెత్తి.
1063
పేదరికము బాయఁ బిచ్చమే గతియన్న
నంతకన్న నీచుఁ డవని లేడు.
1064
బ్రతుకు శూన్యమైన బ్రతిమాలి యడుగని
సద్గుణంబు వ్యాస్తి సర్వజగతి.
1065
గంజినిళ్ళె యైన కష్టించి చమటోడ్చి
యారగింప రుచికి నంతులేదు.
1066
ఆవుకైన నీళ్ళ నడుగరాదొక్కని
నాల్కగొప్ప కఫుడె నాశనమ్ము.
1067
యాచకాళి నెల్ల యాచించి వేడెద
నడుగవలదు లోభులైన వారి.
1068
యాచకమను నావ దాచుట యను బండ
తగిలి సాగలేక పగిలిపోవు.
1069
తలచినంత మనసు ద్రవియించు యాచింప
దాచుటంతకన్నఁ దారుణమ్ము.
1070
అడగ నెంచ గుండె తడఁబడు లేదన్న
నాగిపోత నిలచు టబ్బురమ్మె.

108.ఆల్పులు
1071
అందఱివలె నుందు రల్పులఁ జూడంగ
తెలుసుకొనంగ లేము గురుతు దెల్పి.
1072
తెలివిపరులకన్న తెలివి హీనుడె మేలు
దిగులుపడడు గాన దేనికైన.
1073
అల్పు లమరు లగుదు రది యెట్టు లన్నచో
తలచినట్లు జేయగలరు గాన.
1074
అల్పుఁ డతని కన్న నల్పుని గనుగొని
తానె గొప్పగాను దలఁచుకొనును.
1075
అల్పుడైనవాని యాచొరమే భయ
మాళచేత మిగత నబ్బు కొంత.
1076
మర్మమెకటిఁ దెలియ మారుమ్రోగింతురు
తగుదు రల్పు లెల్లఁ దప్పెడలకు.
1077
మెక్కినట్టి చేతి మెతుకైన నల్పుండు
పెట్ట దొకరి కీడ్చి కొట్టకున్న.
1078
అడుగ నేదినీయ డల్పుండు చెఱకును
పిండినట్లు గాన్గఁ బిండకున్న.
1079     
తినుటఁ గట్టుకొనుటఁ దిలకించినంతనే
యల్పు దోర్వలేక నంగలార్చు.
1080
అల్ప కష్టములకు నమ్ముడు పోవంగ
నర్హ తెవరికుండు నల్పు విడచి.


No comments:

Post a Comment