Thursday, 3 September 2009

tel12Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్)
III. కామకాండము
109. మోహనాంగి
1081
అమర కాంతయౌనొ నెమలౌనొ యా భామ
మోహజలధి నిట్లు ముంచుటేమి!
1082
దండుకోడఁ వచ్చి తాకినట్లున్నది
చూడఁజూడ నన్ను సుందరాంగి.
1083
ఎఱుంగ నెముడనంగ నెవ్వాడొ మున్ముందు
కంటి దేవి వెడద కండ్లనిపుడు.
1084
కనినయంత కనులు తనివేయు ప్రాణమ్ము
మోహమెందు బోయె ముగ్ధకనుల.
1085
చంచలాక్షి కనుల స్మరుడుండు జముడుండు
లేడితోడఁ మూడు తోదుగాను.
1086
వంకదీరకున్న వామాక్షి కనుబొమల్
విచ్చుకనులు బాధబెట్ట విల్లు.
1087
మత్తగజము కంటి మరుగు పచ్చడనుట్లు
స్నిగ్ధ బిగువు చనుల జీలుగుపైట.
1088
పగతుఁదునుము నట్టి పౌరుషం బడుగంటె
వెలఁది నొసటినున్న వెలుఁగు గనిన.
1089
హరిణ నేత్ర్రికేల యాభరణంబులు!
నిగ్గు దేరినట్టి సిగ్గె చాలు.
1090
కల్లు ద్రాగకున్న గలుగదు మైకమ్ము
కామ మట్లుగాదు కనినఁ జాదు.


110. ఆలోకనం
1091    
కలికి జూపు నొప్పి గలిగించు నొక్కటి
మందుగాగఁ దాని మాన్పు నొకటి.
1092
భొగమందు నర్థభాగమ్ము కన్నను
అధికమగును చూపులందె సుఖము.
1093
చూచెఁ జూచెనంచు జూడంగఁ దలపంచె
మొలకవోయునేమొ వలపు లిట్లు
1094
నేనుఁ జూడఁ దాను నేలపైఁ జూచును
జూడకున్న నోరజూచి మురియు.
1095
నవ్వుకొనును లోన ననుజూడ నట్లుగాఁ
జూచి యోరగంటఁ సుందరాంగి.
1096
పగచుకొన్న విధము బలికిన బలుకులే
స్నేహలతను బెంచు చిత్తమలర.
1097
పొలఁతి చూపు మాట పొడిచినట్లున్నను
వలపు లేదనంగ వలనుగాదు.
1098
చూచినంత నన్ను జూచిన నొయ్యారి
మందహాసమందు మరులు గలదు.
1099
తెలియనట్లుగానె తెలికించు ప్రక్రియ
కాముకులకు వచ్చు కైవశమ్ము.
1100
కండ్లు కండ్లుతోడ గలసిన పిమ్మట
మాటలేటి కింక నోటిచేటు.

 
111. పరవశమ్ము
1101
పరవశమ్ము జెందు పంచేంద్రియమ్ములు
పంకజాక్షి తోడు ప్రాప్తమైన.
1102
చాలినన్ని గలవు జబ్బుకు మందులు
వలపు జబ్బుకెల్లఁ వనితె మందు.
1103
పద్మ నేత్రుపథము పడతి కొగిలికన్న
నద్జిక సుఖమునిచ్చు నదియెకొదు.
1104
తాకకున్న వేడి తాకిన చల్లన
నింతనిప్పు వనిత చెంతఁ గలది.
1105
కలసినప్పుడెల్ల నలివేణి కాగిలి
చొక్కఁ జొక్కఁ మిగుల సుఖమునిచ్చు.
1106
కలికి కరములందు గల దమృతం బొకో
తాకినంతఁ దనియుచుండు నొడలు.
1107
అతివ కొగలింపు లాకలిదప్పుల
మాన్ప గలుగునట్టి మహిమగలది.
1108
విందుబెట్టి కుడుచు చందంబుగా నుండు
కలికి కొగలింప గలుగు సుఖము.
1109
కలిసినట్లు గలసి కలహించి కూడుట
కామకళకు ప్రణయ ధామమగును.
1110
తెలియ్ఁ దెలియఁ దెలియుఁ దెలియనిదేమని
కలియఁ గలియనట్లె కామ కళయు.
 
112. ప్రశంస
1111
కుశలమా! శిరీష కుసుమమా! నీకన్న
మృదు శరీర నాదు హృదయరాణి.
1112
పూలఁజూచి మనస పొంగిపోయెదవేల?
చూడఁదగిన కలికి చూపులుండ.
1113
పరిమళించు మేను పండ్లన్ని ముత్యాలు
తలిరు బోడి బొమలె యలరువిల్లు.
1114
కలువపూలకెల్లఁ గనులున్న వనుకొన్న
కలికి కనులఁజూచి తలలవంచు.
1115
కాడలున్న పూలు కలికికి భారమ్ము
తురుమ వెరచు నడుము తుణుగునంచు.
1116
చంద్రుడన్న భ్రమతో చంచలాక్షిని జూచి
చుక్కలెల్ల మింట బిక్కరించె.
1117
పూర్ణచంద్రునందు బొరలుండుఁ గానంగ
కలికి మోమునందు గలదె మచ్చు.
1118
పొలఁతి మోము రీతి మురిపింప గలవేని
గౌరవింతునోయి కలువరాజ.
1119
ఉత్పలాక్షి మోము నొప్పుగాఁ దలచిన
కంట బడకు మింతఁ గలువరాజ.
1120
అలరులైన గాని హంసతూలికలైన
కలికి పాదములకు కంటకములె.


113. తలపోత
1121
పాలు తేనెగలసి జాలువారిన రీతి
మగువ పంటినీరు మధుర మగును.
1122
ఊపిరికిని నొడలి కున్నట్టి సామ్యమ్ము
యామె తోడి నాదు ప్రేమ చెలిమి.
1123
కానరాకపొమ్ము కంటిలో పాపాయి
వలపు రాణి కందు వలయు స్థలము.
1124
బ్రతుకు సుందరాంగిఁ బడయుటలో నుండు
దూరమైనఁ చావు చేరువగును.
1125
తలచుకొనుట మఱవు కలిగిననేగాద
మరువలేకపోతి మగువ సోగను.
1126
నేర్పుగాడె ప్రియుడు నేత్రమధ్యము లందు
రెప్పలార్చు బాధఁ దప్పుకొనును.
1127
కలఁడు ప్రియుండు మాదు కనులంటి కాటుక
నలద నతఁడు మరుగు నంచునెంచి.
1128
మనసులోనె ప్రియుండు మాకుండు గాఁబట్టి
వేడి దినము నతఁడు వాడునంచు.
1129
కన్ను మూయ ప్రియండు కనిపించడని నేను
అందు కతని నేల నిందజేయ.
1130
వదలకుండ ప్రియుండు హృదయంబునందుండ
దూరు డందురేల యూరివారు.


114. సిగ్గు
1131
బ్రతుకదేది కామ బాధకుఁ జిక్కిన
సిగ్గు విడచి బయట ముగ్గకున్న.
1132
తాళలేక విరహ తాపమ్ము తనువది
సిగ్గు విడచి తిరుగ సిద్ధమయ్యె.
1133
 మగత, మానమెల్ల మాయమైపోయెను
బలముగాను నిలచె భంగపాటు.
1134
వలపు వరదదాట వశమౌనె సిగ్గును
చేవ గల్గినట్టి నావ నెక్కి.
1135
సంధ్య నన్నదేల సాధించు బగబట్టి
లేని కతనఁగాదె లేమచెంత.
1136
విరహ బాధ నిద్ర కరువయ్యె నడిరేయి
న్దలచి తలచి ముందు వలపు లన్ని.
1137
ఉదధి యట్లు కామ ముప్పొంగుచున్నను
మాన రక్షజేయు మగువకెనయె.
1138
నిగ్రహించుకొన్న నిలువ దీ కామమ్ము
బయటెఁబడక నెట్లు భ్రతపరుప.
1139
దాచుకొన్న వలపు దాగక నూరెల్ల
బట్టబయలు జేయ బరుగులెత్తు.
1140
ఏనుబడినపాటు లితరులు పడియున్న
నవ్వ రిటుల వారు నన్ను జూచి.


115. వదంతి
1141
ఎగిరిపోక ప్రాణ మీదాక నుండుట
మరుగు మరుగు నాడు మాటగాదె.
1142
రట్టుబెట్టి వారె రచ్చకు దెప్పించి
సభ్యమునకు మిగుల సాయపడిరి.
1143
ఊరివారికెల్ల నూరిపోసిరిగాన
వలపు అతకు వ్రేళ్ళు బలుసుకొనియె.
1144
వృద్ధిపొందె వలపు వేమారు దృఢముగా
నోట నోట బడిన మాటవలన.
1145
మైక మబ్బు కల్లు మరి మరి ద్రాగంగ
చెప్ప చెప్ప వలపు చిగురు దొడగు.
1146
ఒక్క దినమె కలసి యున్నది; యూరెల్ల
గ్రహణ చంద్రు విధము గాంతురేల.
1147
ఎరువు నిళ్ళుబెట్టి యెదిగించు కామమున్
ఊరు గలిసి తల్లి దూరుటైన.
1148
ఆడిపోసుకొన్న నాగునె కామమ్ము
ఆజ్యధార నగ్ని నాపనగున!
1149
రట్టుబెట్టి వీధి గుట్టు దీసిన యట్టి
భంగపాటె మాకు భద్రమింక.
1150
ఉల్లమలరె మమ్ము నల్లరిపాల్జేయ
మేలె ప్రియుడు విడువ కేలు కొనగ.

116. నిర్వియోగము
1151
విడువలేని నన్ను నడుగుము విడుటైన
వచ్చుచఱకు నుండువారి నడుగు.
1152
సుఖముఁ జూపులందెఁ జూచితి మున్ముందు
దూరమగుట నెంచ దుఃఖ మొదవు.
1153
బుద్ధిమంతులకును పోసగును విడిపోవ
విడువ ననుట నమ్మ వీలుగాదు.
1154
వదల నన్నవాడు వదలుచో నాశతో
నంటుకొన్న దాని దగునె తప్పు.
1155
కాచుకొనుటె లెస్సకాంతుని విడనీక
వీడిపోయెనేని కూడు టరుదు.
1156
వెళ్ళి వత్తునంచు విడబడు నవ్వాడు
మళ్ళి వత్తునన్న మాట నిజమె.
1157
విరహ బాధ నెఱుకబరచెడి విధముగా
గాంతు దిట్టఁదొడగె గాజు లూడి.
1158
వారివారు లేని వాసమ్ము కష్టమ్ము
అరయగా వియోగ మంతకన్న.
1159     
అగ్గివంటి బాధ ననగాదు వలపును
తగులు బాధ దీని దాకకున్న.
1160
సాగనంపి బాధ సహియించి జీవింప
నిష్టపడెడివార లెంద రిలను.

117.  వియోగము
1161
దాచుకొన్నకొలది దాగకఁ గామమ్ము
ఊట నీటినోలె నూరుచుండు.
1162
కప్పి పుచ్చ వీలుఁగానట్టి దీ బాధ
చెప్పి పంపనైన సిహ్హుగలది.
1163
ప్రాణదండమునకు వలపును, సిగ్గును
కావడట్లు వంగి కష్టపెట్టు.
1164
ఉదధి పోలెఁ గామమున్నది దాటంగఁ
దగిన యెడలేకఁ దల్లడిలుదు.
1165
కష్టపట్టునతని కిష్టమున్నప్పుడే
ఇష్టపట్టగలడె కష్టమున్న.
1166
కలసినపుడు సుఖము కడలివంటిదగును
కలయనపుడు దిగులు కడలికన్న.
1167
విరహబాధ నీద వీలుగాకుండఁగా
అర్ధరాత్రి నొంట నలమటింతు.
1168
అందఱీకిని నిద్ర నందించు నీరాత్రి
నన్ను తోడు జేసుకొన్న దేమి.
1169
విరహ బాధకన్న వేదన గలిగించు
దినదినమ్ము నిశలు దీర్ఘమగుచు.
1170
మనసుతోడఁగూడి కనులేగియున్నచో
మోహజలధి నిట్లు మునుగహుందు.

118. నిరీక్షణ
1171
కండ్లు గాదె ముందు కలిగించె కామమ్ము
పరితపించు నిపుడు విరహమునకు.
1172
కాంచినంతప్రేమ కలిగినందుకుగాను
దుఃఖపడగవలయు దూరమైన.
1173
ముందుపోయి కనులు మోహమ్ము కొనితెచ్చె
తాళకున్న నివుడు గేలికాదె.
1174
తీర్చలేని బాధ దెచ్చిన వీకండ్లె
యేడ్వవలయు నీర మింకు వఱకు.
1175
మోహజలధి నన్ను ముంచిన వీకండ్లె
కుములవలయు నిట్లు కునుకురాక.
1176
సరియె కన్నులిట్లు పరితపించుట జూడ
కష్టపెట్టలేదె కామమిచ్చి.
1177
ఏడ్చి యేడ్చి కన్ను లింకిపోవలయును
చొక్కి చొక్కి ముందు జూచెగాన.
1178
మాయమాతలాడి మరుగైనవానినే
చూడ గోరుచుండు చూపులెల్ల.
1179
రానినాళ్లు నిద్ర రాదాయె వచ్చినన్
నీరసించె కండ్లు నిద్రలేక.
1180
ఊరివారికెల్ల నోరెత్తి చాటించు
దాపలేక కండ్లు తాప భరము.

119. పాలిపోవుట
1181
వలపుగాని విడచి పాలితి నీరీతి
ఎవరికోడ దీని నెఱుకబరతు.
1182
ప్రియుడె దీని నీకుఁ బ్రియమార విడెనని
మోహమునకుఁ బాలె దేహమెల్ల.
1183
సిగ్గు చెలువుతాను జేకొని బదులుగాఁ
దాపమిచ్చె మెరుగు తఱుగఁ దనువు.
1184
మరువ కతని వలపు మరిమరి చింతిప
పసదొరంగి మేను పాలుటేల.
1185
అదిగొ ప్రియుడుదాటె నంతలో నామేన
బాలిపోవదొడగె బసిమి చాయ.
1186
దీపకాంతి తగ్గఁ దిమిరమ్ము బైకొను
విధము పాలె మేను ప్రియుని బాయ.
1187
ప్రక్కనుండి ప్రియుఁడు చెక్కిలి నిమురుచు
ప్రక్కజూచినంత బాలెమేను.
1188
మోహమునకు బాలిపోయిన దనువారు
దిట్టరేమి వదలి నట్టివాని.
1189
మంచిగాను ప్రియుడు మనసీయజాలును
పారిపోవుటైన వగవు జెంద.
1190
పాలిపోవుటకును భయమొందగాలేదు
దుష్టుడంచు ప్రియుని దూరరేని.

120. విరహతాపము
1191
ఒకరి నొకరు వలచి వలసించు కొన్నచో
వారి వశమె కామఫల సుఖమ్ము.
1192
బ్రతుకు బాగుజేయు వర్షంబు పోలిక
ప్రియుండు ప్రేయసియెడ ప్రేమ గనుట.
1193
కోరుకొన్న ప్రియుని గూడిన కాంతకు
ప్రేమ గర్వ మొండు పెనగుచుండు.
1194
ప్రియుని ప్రేమలేని ప్రేయసి నెవరెంత
గొప్పఁ జెప్పుకొన్న గొఱత గొఱత.
1195
తలపఁ డతడు నన్ను తానెట్లు వలచినంత
సిగ్గు మాలి నాదు చెంతవచ్చు.
1196
ఇన్నినాళ్ళు బ్రతికి యున్నది యెట్లన్న
దలచి తలచి ముందు వలపులన్ని.
1197
మరచుటన్న మాటె మండించు హృదయమ్ము
మరచి బ్రతుకు మాట మాట యగునె.
1198
ఎంత దలచుకొన్న నేమని కినయండు
ప్రియుణానుగునట్టి ప్రియమదౌను.
1199
ఎంతగానొ జెప్పె నిర్వుర మొకటని
చెంతలేక నిపుడు చింతబెట్టె.
1200
విడచినట్టివాని వెదకి పట్టెడుదాక
గదలిపోకుమోయి కలువరాజ.

No comments:

Post a Comment