Thursday 3 September 2009

tel07



Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్)

61. అలసత్వము
0601
వెలుగు గలుగు గృహము మలిగిపోకున్నను
గోళ్ళు గిల్లుకొన్న గ్రిడ్డిదగును.
0602
అలసత కలసతను కలిగింత్రు తమ యిల్లు
విల్లుగాగనుండ నెంచువారు.
0603
గోళ్ళు గిల్లుకొనుచు కూర్చున్న కాపుర
మంతరించు వానికన్న ముందు.
0604
ఇల్లు గనినవేరు గుల్లయైపోవును
మందు డగుచు యత్నమందకున్న
0605
మఱవు, జాగు, నిద్ర, మందతయును నాల్గు
చెడగ నుండు వాని తొడవు లగును.
0606
ఖ్యాతి తరుగకున్న నీతిగా దలసత
పొందఁదగినదైనఁ జొందలేము.
0607
పాలుమారుటైన పనిపాట్లు లేకుండా
పోటుగాను నిందమాట వచ్చు.
0608
భవ్య గృహము నందు ప్రాల్మారి కేర్పడ్డ
శత్రువులకు సేవ సలుపవలయు.
0609
మరుగుపడిన వేరు మెరుగౌను శీఘ్రమ్మె
మందముడిగి కార్యమగ్నుడైన.
0610
అడుగులందు దార విడచిన రాజ్యమ్ము
మరల పొందవచ్చు మందముడుగ.


62. ప్రయత్నము
0611    
విలుగాదటంచు వినుగొందగా నేల
దాని కగును విలువ పూనుకొనిన.
0612
పూనుకొన్న పనిని పూర్తిగా జేయక
విలువు వాని జగము నిందజేయు.
0613
ఉపకరింప గల్గు నుత్తమ గుణములు
సాహసాత్ము జూచి మోహపడును.
0614
జేడి చేతనుండు వాడి ఖడ్గమురీతి
కార్య శూన్యు డాద గల్గుటెల్ల
0615
సుఖము మఱచి కార్యముఖమున కన్నున్న
వానివలన బ్రతుకు వన్నెకెక్కు.
0616
సాహసమ్ము దెచ్చు సంపదలిన్నింట
నడ్డిలేమి, లేమి కంతులేదు.
0617
సోమరి యగువాని జొచ్చు మూదేవి
లక్ష్యపరుని గూడి లక్ష్మి దిరుగు.
0618
లేకయున్న నింద లేదండ్రు యత్నంబు
జేయనవుడె నింద జేరు నతని.
0619
విధయె శత్రువైన విశ్రాంతి నెఱుగక
పాటుబడ్డ కూలి లోటులేదు.
0620
సాహసాత్మ తోడఁ సహకరించును లక్ష్మి
సోమరి యగువానిఁ లేమివూను
 
63. నిబ్బరము
0621
దుఃఖములను పారదోలంగ మార్గంబు
నొవ్వకుండ జూచి నవ్వుకొనుటె.
0622
పొంగివచ్చు దుఃఖముల నెల్ల ప్రాజ్ఞుండు
మనసులోనె ద్రిప్పి మాన్పుకొనును.
0623
కష్టములను జూచి కష్టపడనివారు
కష్టవెట్టగలరు కష్టములనె.
0624
ఎట్టులున్న మార్గ మెద్దులాగును బండి
పట్టుబట్ట వెతలు పలచబడును.
0625
వెతలు వేరుకొన్న మతి చలింపదయిన
వెతలు వెతలు పడెడు గతికివచ్చు.
0626
పోయెనంచు దిగులు పొందుటను తెలియ
రున్ననాడు లోభ ముడుగువారు.
0627
కష్టములకె మేను కలదను వెద్దలు
తొట్రుపాటు బడరు దుఃఖములకు.
0628
సహజమనుచు వెతలు సహించి సౌఖ్యమ్ము
కోరకున్న దుఃఖ భారముడుగు.
0629
సుఖము గల్గు పట్లఁ జొక్కిపోవని వారు
వెతలు గల్గుపట్ల వెఱ్ఱిగారు.
0630
కష్టమనుభవింప నిష్టపడెడి వారి,
వైరులైన జూచి గౌరవింత్రు.
 
64. మంత్రి
0631
సాధ్య సాధనములు సమయమ్ము స్వప్రజ్ఞ
యచితమగును జూడ సచివునందు.
0632
అభయ, మాలకింపు, ప్రభవమ్ము, జ్ఞానమ్ము,
తంత్రమైదు వలయు మంత్రి కెవుడు.
0633
సచివుఁ డెరుగవలయు సామ దానమ్ములు
చెదరగొట్టి మఱలఁ జేరదీయ.
0634
స్థిరముగాను దెలిసి స్థిరముగాఁ జెప్పెడి
కార్యవాది మంత్రిగాఁగఁ దగును.
0635
ధర్మమెరిగి మాట ధాటిగ జెప్పెడి
కర్మటుండె మంత్రిగాగ దగును.
0636
ప్రజ్ఞతోడఁ శాస్త్ర పరిచయంబున్నచో
నంతకన్న విజ్ఞ తరయ గలమె.
0637
ఎంత దెలిసియున్న నిల సాంప్రదాయమ్ము
మరువ దగదు కార్య మార్గమందు.
0638
తనకు దెలివిలేదు, వినమన్న వినడట్టి
వాని దిద్దగలుగు వాడె మంత్రి.
0639
మర్మమైనయట్టి దుర్మంత్రి కన్నను
పదియు కోట్లు మేలు పగతుడైన.
0640
కాగల పనులైన కాకనే జెడిపోవు
చేతగాని మంత్రి చెంతనున్న.


65. వాక్చాలత
0641
మాటకారితనము మానిత సంపద
విలువలందు దాని విలువవెరు.
0642
మాట కోడవచ్చు మంచి చెడుగులన్ని
నిలువుకొనుము మంచి పలుకు లెఱిగి.
0643
మిత్రవరుల వోలె శత్రువులైనను
“జార” యనుటె మాట సౌరనంగ.
0644
మాట తిరెరింగి మాటాడు మాటాడ
దానిలోనె ధనము ధర్మముండు.
0645
పలుకబూన మారు బలుకని రీతిగా
తెలిసి పలుకునదియె పలుకనంగ.
0646
మధుర భాషణముల నెదిరి జెప్పిన దాన
మంచి నెఱుఁగు నతఁడె మాటకారి.
0647
వాగ్విలాస మెఱిఁగి వదరక విర్భీతి
పలుకు నతని గెలువ వశముగాదు.
0648
పలికి నట్లు జగతి పనిచేయు వాక్శుద్ధి
కలిగి పలుకు నతఁడు పలికెనేని.
0649
అతిక జెప్పు వారు మితభాషణమ్ముల
యుక్తియుక్త మెరుగకున్న వారె.
0650
పరిమళమ్ము లేక విరిసిన పూగుత్తి
చదివి వ్యక్తపరుప జాలకున్న.


66. సత్క్రియ
0651
తోడు మంచిదైన తోడాను సంపద
శిష్ట వృత్తి సకల సిరుల నిచ్చు.
0652
ఆచరింప గవల దపకీర్తి దెచ్చెడి
కార్యములను సర్వకాలమందు.
0653
రాను రాను వైకి రాగోరు వారలు
బొగడఁబడని బనులఁ దెగడవలయు.
0654
గాసితోడ నెన్ని కష్టాల పాలైన
చిత్త బలులు హీనవృత్తి దిగరు.
0655
చేయరాదు వెనక జింతించు పనులను
చేసియున్న మఱల చేయవలదు.
0656
కన్నతల్లి యాకలన్నను, దానికై
తప్పుదారి ద్రొక్క దగవు గాదు.
0657
దుష్కృతంబు వలన దొర యౌటకన్నను
వేదవడిన శిష్టవృత్తి మేలు.
0658
చేయదగని పనుల జేయంగ లాభమ్ము
కలుగుటైన కీడు గలుగు మఱల.
0659
దుఃఖ పెట్టి యొరుల దోచిన ద్రవ్యమ్ము
దుఃఖ పడగ జేసి తొలగిపోవు.
0660
మోసగించు వృత్తి దాచిన సంపద
యోటికుండలోని నీటి విధము.


67. కార్యసిద్ధి
0661
సర్వకార్యసిద్ధి సంకల్ప సిద్ధియే
అన్ని దాని యందె యైక్యమగును.
0662
చిక్కులందు బడమి, శ్రేష్టమ్ము పడినచో
చొక్కి పోమి కార్యసూరు మతము.
0663
పూనుకొన్న పనిని పూర్తిగావింపక
నిలువుకొన్నవాడు నిందపాలు.
0664
చెప్పవచ్చు నెన్నొ చెప్పిన రీతిగా
ననుసరించు వార లరుదు జూడ.
0665
కీర్తి దెచ్చుపనుల కృతకృత్యు డైనచో
చక్రవర్తియైన సత్కరించు.
0666
కోరు వారి శ్రద్ధ కొఱతఁగాకున్నచో
కోరుకొన్న దెల్లఁ గూడివచ్చు.
0667
ఆకృతిగని యెంచ కల్పుగా నొకనిని
తేరును కడచీలె తిరుగబెట్టు.
0668
శంక లేక నొకటి సంకల్ప శుద్ధితో
విసుగు లేకఁ జేయ దొసఁగు రాదు.
0669
విఘ్నములకు వెఱచి విడువక సత్కర్మ
పూర్తిజేయ వలయు పూనినట్లు.
0670
ఎన్ని యున్న లోక మన్నదు, దృఢచిత్త
మొండు లేని యెడల బెండుగాన.

68. కార్యదీక్ష
0671
నిర్ణయమున కెల్ల నిర్వాహ దీక్షయే
యాలసింప దాని కవగుణమ్ము.
0672
ఆలసింప దగిన దాలసించుట లెస్స
వేగపడగ నున్న జాగుచెడువు.
0673
కార్యమెట్టిదైన కడతేర్చవలయును
సాధ్య మెట్లొ యట్లు జంకువిడచి.
0674
శత్రుశేషమున్న శ్రమశేషముండిన
నగ్ని కణము నార్పనట్టి విధము.
0675
కలిమి బలిమిస్థలము కాలమ్ము పక్వమ్ము
నెఱిగి జేయ పనులు మెరుగు పడును.
0676
అగునొ కాదొ దెలసి యగుటైన నద్దాని
ఫలితమెఱిగి జేయనలయుపనిని.
0677
అనుభవజ్ఞుడైన నడిగి జేసిన కార్య
మెప్పటికిని చెడక మెప్పు వడయు.
0678
కార్యమునకు తోడు కార్యమ్ముగైకొమ్ము
యేన్గు నేన్గు తోడ నీడ్చినట్లు.
0679
ఆప్తు కన్న మేలు సత్యంత త్వరగాను
కాని వారితోడ కలియుటగును.
0680
తగ్గుదలను జూచి తడయక వెంతనే
భీతి దీర్ప సంధి నీతి యగును.

69.  దూత
0681
ప్రేమ సత్కులమ్ము పృధినీళు సంప్రీతి
కలుగు నతఁడు దూత గాగ దగును
0682
ప్రేమ, ప్రజ్ఞ, విషయ విశ్లేషణా శక్తి
దూతకు నివి మూడు తొడవు లగును.
0683
విదురులందు గొప్ప విదురుండు ద్యూతమ్ము
క్ష్మాతలేంద్రు లెదుట సలువు నతఁడు.
0684
తగిన రూపు, తెలివి తరుగని విద్యయు
మూడు దౌత్యమునకు ముఖ్యమగును.
0685
ప్రియపడంగ జెప్పి వెగటును తప్పించి
నయము గూర్చు నతఁడె స్వయము దూత.
0686
నీతి నిర్ణయమ్ము నిలకడ నిర్భీతి
దోహదమ్ములగును దౌత్యమునకు.
0687
బాధ్యతెరిగి కాలపక్యమ్ము గుర్తించి
స్థానమెఱిగి పలుకు జ్ఞాని దూత.
0688
సత్ప్రవర్తనమ్ము సఖ్యమ్ము తుల్యత
దూత లక్షణముగఁ జూతురెల్ల.
0689
తప్పు బలుక డెవఁడొ తడబాటుగానైన
వాఁడె తగిన రాయబారి యగును.
0690
చావు మూడుటైన క్ష్మాతలేంద్రుల మేలు
గోరు నతఁడె రాయబారి యగును.

70. రాజాశ్రయము
0691
తగిలి తగలకుండ పెగ గాచుకొన్నట్లు
బ్రతుకవలయు నృపుని పాలనున్న.
0692
కోరరాదు రాజు కోరెడి కోర్కెల
నట్టి యాశ్రితునకు నమరు సిరులు.
0693
మెలగవలయు నెంతొ మెలకువగా నుండి
శంకరాగ మాన్ప శక్యపడదు.
0694
చెవిని జెప్పరాదు చేరి నవ్యగరాదు
విడిచి చెప్పునేని వినుట మేలు
0695
మర్మ మడుగరాదు మర్మంబు వినరాదు
వినుమటన్న దానిఁ వినుట లెప్ప.
0696
ఊహ నరసి కాలమూహించి విన్నది
వినయముగను బల్కు వెగటు విడక.
0697
వినగ దగ్గ వాని వినిపించి వినరాని
వడిగెనేని జెప్ప దొడఁగ రాదు.
0698
బాలుఁడనియు తనకు బంధువనియు నెంచ
వలదు రాజ్యపదని గలిగినపుడు.
0699
ఎన్నబడితి మనుచు నేదైన జేయరు
సుస్థిరమతులైన నుజనులెపుడు.
0700
ప్రాతవాళ్ళ మనుచు నీతికి దూరమై
నడచుకొన్న పదవినష్టమగును.



No comments:

Post a Comment