Thursday 3 September 2009

tel09



Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్)

81. చనువు
0801
చనువనంగఁ జెల్లు సహాయించి యేదైన
స్వీకరించునట్టి స్నేహితంబు.
0802
స్నేహమునకు గుర్తు చెప్పకజేయటే
నొప్పుకొనుటె దాని గొప్పదనము.
0803
చెలిమి చాల నాళ్ళు చేసిన ఫలమేమి
చనువె లేకయున్న సలువ నొకటె.
0804
బాధ్యత గలద్దంచు పాటించి చెప్పక
చేయు వనిని చనువె స్వీకరించు.
0805
తెలియని తనమనుచుఁ జెలిమితో పలికిన
హితుని తప్పు నోర్వ హితమంటుండ్రు.
0806
చనువు వలన గొప్ప సంకటమేరాగ
వదలుకొనడు మిత్ర వరుఁడు దాని.
0807
మిత్రయందు ప్రేమ సూత్రమ్ము తెగరాదు
హితుని వలన బ్రతుకె హీనమైన
0808
వినక నెవరు జెప్ప విశ్వసించెడు మిత్రు
ద్రోహపరచు దినమె దుర్దినమ్ము.
0809
కాల కాలముగను గలసిన స్నేహమ్ము
విడని వాని బొగడు విశ్వమెల్ల.
0810
ఎన్నిజేయ స్నేహ మెడబాటు గానట్టి
మిత్రులఁ బగవారు మెచ్చుకొంద్రు.


82. దుర్జనమైత్రి
0811    
కరిగి ద్రాగినట్లు కనిసించు ఖలుమైత్రి
తరిగినంత మేలు వెరుగనీక.
0812
కలిగినప్పు డుండి తొలిగిన దొలిగెడు
స్నేహ మున్ననేమి చెడిన నేమి.
0813
సాని, దొంగవాని సరిబోలు నందురు
ఫలముగోరి చెలిమి సలుపువారు.
0814
అనిని బారనట్టి యశ్వంబు సరిమైత్రి
యుండు టొకటె లేకయుండు టొకటె.
0815
కష్టములను నాదఁ గానట్టి స్నేహమ్ము
చెడినమేలె వృద్ధిఁ జెందకుండ.
0816
అల్ప జనులతోడి యన్యోన్యమునకన్న
ప్రాజ్ఞులైనవారి పగయె మేలు.
0817
మాట మైత్రికన్న కోటికి లాభమ్ము
శత్రువులుగనుండి సలుపు చెడుపు.
0818
విజయ మొసగు పనికి విఘ్నాలు గల్పించు
చెలిమి వదలనగును జెప్పకుండ.
0819
మాట చేతలందు మర్మంబు గలమైత్రి
కలను గూడ వచ్చి కలతబెట్టు.
0820
ముందు బొగడి వెనుక నిందించు దుర్జను
చెలిమి రెప్పపాటుఁ జేయవలదు.
 
83. తగని మైత్రి
0821
పైకి చెలిమిఁజూపి పగ నెదవర్తించు
చెలిమి, జెలిమిగాదు కొలిమిగాని.
0822
ఐనవారలట్టు లనిపించి వేరైన
వారి చెలిమి వారవనితఁటోలు.
0823
చదివినంత రాదు సంస్కార సంపత్తి
మనసు మనసుతోడ మైత్రిగాక.
0824
నవ్వు తొలకరించు నయవంచకుల మైత్రి
తలఁచుకొన్న భయము గలుగు చుండు.
0825
చిత్త మత్తుకొనని చెలికాని మాటలు
నిర్ణయింపరాదు నిజమటుంచు.
0826
మిత్రులవలె మేలుఁ మిగులంగ బలికినన్
వంచకంబు బయట పడున దెట్లొ.
0827
వినకు కాని వాని వినయంపు మాటలు
విల్లు వంగినట్టి విధముగాన.
0828
దండమన్న చేతి దాపున క్రూరస్త్ర
మణఁచగలడు శత్రువైనవాడు.
0829
కాని వాని యెడల కలసినట్లుండియే
తొలిగిపోవఁ మెఱుగు తొందఱగను.
0830
మోసగానితోడ మురిపించునట్టులే
తెంపుకొనుట చెలిమి కింపటండ్రు.
 
84. అనివేకము
0831
తెలివి హీనముందు దెలిపెడిదేమన్న
చెడువునంటె మంచి విడచుటగును.
0832
హీనమందు గొప్ప హీనమ్ము సర్వదా
చెడు ప్రవర్తనమ్ము విడువకుంట.
0833
సిగ్గులేమి, లక్ష్య సిద్ధిలేమి, మూర్ఖమ్ము
మూడు కూడియుండు మూర్ఖునందు.
0834
చదివి చెప్పగల్లి, నది చేయకున్నచో
వాని కన్న బుద్ధి హీనుడెవడు?
0835
ఏడు జన్మములకు నెడ్డండు నరకమ్ము
నొక్క జన్మలోనె చిక్కబట్టు.
0836
నీతి బాహ్యాఁడగుచు నిర్వహించిన కర్మ
చెడును లేనియెడల శిక్ష మిగులు.
0837
ఇతరు లనుభవింప వెతలంద్రు స్వజనులు
తెలివిహీనుడున్న కలిమి మిగిలి.
0838
వెట్టి కల్లు ద్రాగు విధమగు నవివేకి
హస్తమందు లక్ష్మి యమరునేని.
0839
బుద్ధిహీను మైత్రి తద్దయు సుఖమిచ్చు
తొలఁగునపుడు బాధ కలుగరామి.
0840
మట్టికాళ్ళఁ బరుపు మంచ మెక్కిన రీతి
బుద్ధిహీనుడేగ బుధుల సభకు.


85. అవగుణము
0841
లెక్కుకెక్కదేది లేకున్నఁ జెప్పగా
లెక్కకెక్క బుద్ధి లేకయున్న.
0842
హీను డీయ డేది యిచ్చినన్ నద్దాని
పుచ్చుకొన్నవాని పూర్వకృతము.
0843
కుమతి తనకు దానె కుమిలిపోయెడు బాధ
శత్రువులకు బెట్ట సాధ్యపడదు.
0844
మౌఢ్యమన్న దొకటి మహిమీద నున్నచో
నన్ని దనకె దెలియునన్న మదమె.
0845
చదివినట్లు జెప్ప చదవకఁ జదివిన
చదువులందు బుట్టు శంకలెన్నొ.
0846
తప్పుగప్పు కొనకఁ దనువునే గప్పును
గుణము లేనివాఁడు గొప్పగాను.
0847
మర్మమెడలఁ జేయు మతిహీనుడగువాఁడు
తనకుఁదానె కీడు ననుభవించు.
0848
వినమి జెప్పినట్లు తనకైన దెలియమి
చచ్చుదనుక వెంట వచ్చునొప్పి.
0849
బుద్ధిహీను దెవడు బుధులమాట వినడు
తనదు మార్గమందె తాను పోవు.
0850
లోకులున్న దన్న లోకోక్తికాదన్న
వాని దయ్యమనుచు వసుధ బిలచు.


86. కలహము
0851
కలసి మెలసి యుండు చెలిమిని బాధించు
రుగ్మత కలహంపు రూపమగును.
0852
చెలిమి లేకయున్న చెడువుగాదొకనికి
కలహమాడరాదు కలుసుకొన్న.
0853
బాధలందు మిగుల బాధించు కలహమ్ము
విడచి నంత దాని వెలయు కీర్తి.
0854
కష్టములకు నెల్ల కలహమ్ము మూలమ్ము
దాని వెడువ సుఖము తానె వచ్చు.
0855
కలహములకు దిగకఁ దొలగి పోయెడువాని
గెలువ దలచువారు గలరె జూడ.
0856
కలహ జీవనమ్ము గలవాఁడు బ్రతుకున
బాగుపడుటకన్ను నోగుపడును.
0857
కలహమందె కన్ను గలవార లెప్పుడు
నీతి మార్గమందు నిజము గనరు.
0858
పగకు దూరమైన ప్రాప్తించు సంపద
లంట దాని చెడుగు లావహంచు.
0859
కలహ దూరమైన కలదు భ్రదత దాని
వెంచుకొన్న చెడుపు ముంచుకొనును.
0860
కలహ వర్తనమున కలుగును కష్టాలు
నీతి పథమునందు నిధులు దక్కు.


87. శత్రుశక్తి
0861
అధికులందు కలహమాడుట దోషమ్ము
ఆడకున్న దోష మల్పులందు
0862
సానుభూతి, మైత్రి స్వబలమ్ము లేనట్టి
వాని శత్రువెట్లు వదలిపెట్టు
0863
దానహీను, బుద్ధిహీను నిర్ధాక్షిణ్య
గెలువ సులభ మెట్టి బలములేక.
0864
విడువఁడాగ్రహమ్ము విడచు నిదానమ్ము
నట్టినాఁడు లోకు వందఱికిని.
0865
నీతియు నియమమ్ము నిత్య కర్మములేని
నిందపరుని గెల్వ వందమంది.
0866
కన్నుఁగాననట్టి కామమ్ము కోపమ్ము
నున్నవాని గెల్చు టుత్సవంబు.
0867
ఇచ్చియైన కలహమేర్పడ జూడుము
దగ్గరుండి గుంట ద్రవ్వువాని.
0868
దుర్గుణంబుతోడ దుశ్చేష్ట లలవడ్డ
రోతురెల్ల శత్రు ప్రీతినాఁడు.
0869
సమరమునకు తృప్తి, సాధ్యత సబ్దుద్ధి
లేనివాడు శత్రువైన యెడుల.
0870
శాస్త్ర హీనుతోడ శతృత్వమందని
వాని నెట్టి కీర్తివలచిరాదు.

88. విరోధనిరోధము
0871
వైరమనెడు దుష్టవర్తన పరిహాస
మునకునైన వెట్టుకొనఁగ రాదు.
0872
కలహ మాడవచ్చు విలుకానితో నైన
వలుకులాడువాని పగను వలదు.
0873
తనకు బలము లేకఁ దనవారు లేకుండ
కలహమునకు దిగినఁ గలదె బుద్ధి.
0874
పగతునైన నెయ్యముగ జేసుకొనువాని
ముంచిలోనె జగతి మహిమ వెలుగు.
0875
తోడులేదు జూడఁ, జోడైన బలవాళ్ళు
వాళ్ళనొకని స్నేహ వర్తికమ్ము.
0876
కలసి ముందు వెనక కలహమాడుట కన్న
కలసి కలియనట్లు మెలఁగుటొప్పు.
0877
అరయలేని వాని కగచాట్లు జెప్పకు
బలముఁ జెప్పబోకు బగతునెడను.
0878
తలచుకొన్న పనికి వలసిన సామగ్రి
జేర్చుకొన్నవానిఁ జెరుపతరమె.
0879
ముండ్లచెట్లు నెల్ల మొలకలో గిల్లక
ముదిరినంత గదప నొదవుబాధ.
0880
శత్రువులను నణచ శక్తిజాలని వాఁడు
స్వేచ్ఛగాను శ్వాస పీల్చలేడు.

89.  లోపగ
0881
నీడ, నీళ్ళ గుణము వాడంగ దెలియును
ముందు దెలియదట్లె బంధు పగయు.
0882
కత్తినెత్తు పగకు నొత్తిలఁ బనిలేదు
భయపడంగ వలయు బంధు పగకు
0883
ఐనవారి వైరమగుపించకనె చంపు
కుమ్మరి చెయినుండు కూసు విధము.
0884
అంతరంగ కలహ మారంభమైనచో
చుట్టరికమె నిన్నుఁ బట్టియిచ్చు.
0885
చూడ చుట్టమయ్యు కీడెంచువాఁడున్న
వాని వలన వచ్చు ప్రాణహాని.
0886
ఐక్యపడిన వారికైనచో కలహమ్ము
తప్పుకొనఁగలేము ముప్పురాక.
0887
కలిసినట్లె యుండు కలశమ్మువైమూత
ఇంటి పగయునట్లె యిమిడియుండు.
0888
ఆకురాయి యినుము నరగదీనెడి మాడ్కి
పాడుబడును గృహము బంధుపగళు.
0889
అంతరంగ కలహ మణు మాత్రమున్నను
దాని ముప్పు గొప్పగాను తోచు.
0890
సర్పమున్న యింటఁ సంసారమున్నట్లు
సమరసమ్ము లేక సాగు బ్రతుకు.

90. పెద్దల నవమదించమి
0891
నిందఁ జేయకున్న నియతాత్ములను జూచి
క్షేమ మంతకన్నఁ జెప్పలేము.
0892
ఆర్యులైన వారి కవమాన మొనరింప
వారి వలన తగని బాధ్యలబ్బు.
0893
చెడగనున్న, నేది నడుగకు పెద్దలఁ
జావుఁగోర కీడు సలుపఁజాలు.
0894
ఆర్యులైన వారి కవమాన మొనరింప
తట్టి లేపినట్టు దండధరుని.
0895
తప్పి బ్రతుకలేడు ధరణిలో నెచ్చోట
శిక్ష జనుల మనసు కష్టపడిన.
0896
బ్రతుకవచ్చు నగ్ని బడియైన, పెద్దల
నవమదించి బ్రతుక నలవికాదు.
0897
ఇంద్ర భోగమైన నేమౌను శిష్ఠుల
మనసు కష్టపడిన మరుక్షణమ్ము.
0898
అచలులైన వారి నవమదించిన వారి
యాస్తినాస్తి వంశ మంతరించు.
0899
బ్రహ్మ చింతనుండు ప్రాజ్ఞులు కోపింప
రాజు జోగి యగును రాజ్యమెడలి.
0900
చివుకుమనినఁ జాలు సిద్ధుల హృదయము
లంగరక్ష లెవ్వి యాదుకొనవు.

No comments:

Post a Comment