Thursday, 3 September 2009

tel08Thirukkural in Telugu
తిరుక్కురళ్ (Translator: గురుచరణ్)

71. గుర్తింపు
0701
అంగములనె జూచి యంతరంగ మెఱుగు
మనుజఁ డవని లోన మానికంబు.
0702
మనసు నందు నుండు మర్మంబు ముఖమందె
చూచి చెప్పు నతఁడు సురల కీడు.
0703
చూచినంతలోనె సూక్ష్మమ్ము కనిపెట్టు
వాని గొనుము తనువునైన నిచ్చి.
0704
ఉన్న తలపు చెప్పకున్నను గుర్తించు
నతడు వేరె లోకు లందరందు
0705
గురుతులన్ని జూచి గురి గానకున్నచో
కన్నులంగ మందు గన్నదేమి.
0706
తనదు రూపుఁ జూపు దర్పణం బట్టుల
వదనమెత్తి జూపు హృదయ గతిని.
0707
కష్ట సుఖములెల్ల గననౌను ముఖమందె
దేని జూచి మిగత దెలియవలయు?
0708
అర్ధమగును ముఖము నం దంతరగమ్ము
ముద్రలెఱుంగు వాని ముందు నిలువ.
0709
పగయు, మైత్రి కండ్లు ప్రకటించుగావున
శక్తి వలయునండ్రు సంజ్ఞలెఱుగ.
0710
సూక్ష్మబుద్ధి యంచు చూవరు లెఱుగంగ
కండ్లుగాక వేరె కలదె చూడ.


72. సభ
0711    
మాట పొందుఁదెలసి కూటమ్ము గమనించి
వక్తస్ఫుటముగాను వ్యక్తపఱచు.
0712
మాట తేట లెఱుగు మహనీయలందఱు
నున్న చోటెఱింగి యచ్చరింత్రు.
0713
స్థితిని దెలియలేకఁ జెప్పెడివారెల్ల
మాట దెలియనట్టి మోటువారె
0714
నిపుణులందు జూపు నిపుణత్వమున్నచో
మూగ వోలెనుండు మూర్ఖులెదుట.
0715
సుఖములందు గొప్ప సుఖమగు, పండితు
లున్న సభను మాట లుడిగియున్న.
0716
విజ్ఞులెనవారు వినుపించు సభలోన
నడ్డువచ్చు వాని యెడ్డడండ్రు.
0717
చదుపుకొన్నవారి సామర్థ్యమంతయు
పండితాళి ముందె పరిమళించు.
0718
ఆలకించు వారి నరసి మాటాడుట
ఫలితమున్న చేను బార్చినట్లు.
0719
సభను మెప్పు గోరు చతురండు మఱచియు
పలుకరాదు మోటు వారిముందు.
0720
మలినమందు సుధను జిలికిన విధమౌను
సాటిలేని వారి సభను బలుక.
 
73. సభాకంపము
0721
పలుకులందు భవ్యభావమ్ము గలవారు
సభకుజంకి మాట సడలరెపుడు.
0722
చదివి నట్టివారి సన్నిధి చదివిన
చదుపు వ్యక్తపఱచు బుధుడె బుధుడు.
0723
పగతు నెదిరి పోర, పలువురు సిద్ధంబు
నిర్భయముగా సభను నిలువలేరు.
0724
ఎఱిగినట్టి విషయ మెఱిగించి యెదిరిచే
యెఱుగ దగినదెల్ల నెఱుగవలయు.
0725
చర్చ జరుగువేళ సభలోన జంకక
బుధుల కెదురు నిలువ చదువ వలయు.
0726
వాడి ఖడ్గమేల బోడిమి దప్పిన
చదువదేల సభకు ముందము నిడక.
0727
బేడి కత్తిబట్టు బెదురు వారెస్వరు?
శాస్త్ర పఠనమేల సభకు జంక.
0728
ఎంత జదుపుకొన్న నేమౌను సభలోన
వ్యక్తపరుపకున్న ముక్తసరిగ.
0729
చదివి జంకునెడల శాస్త్ర పాటవముండి
విద్యరామికన్న వెలితి యగును.
0730
చదివి జదువనట్లె శాస్త్రజ్ఞులకు జంకి
తెలితఁజెప్ప లేకఁ దెల్లబోవ.
 
74. రాజ్యము
0731
పాడి, పంట, ధనము పండిత ప్రాబల్య
మున్న దాని రాజ్యమున్న తగును.
0732
కోరఁదగిన యట్టి భూరి సంపదలుండి
దిగులు దీర పండ దేశమగును.
0733
పన్నులిచ్చి వలస పచ్చిన పోషించి
రక్తి చెడనిదగును రాజ్యమన్న.
0734
తిండి భయములేక తీవ్రబాధలు లేక
రణ భయమ్ములేమి రాజ్యమగును.
0735
అంతరంగ కలహ మన్యాయ వర్తన
రాజ్యహత్యలేమి రాజ్యమగును.
0736
ఏ త్య్వద్రవమ్ము నెఱుగక వచ్చినన్
సష్టపడని దగును నాడటన్ను.
0737
కోట కొండలుండి నిటితో నదులుండి
వర్షపాతమున్న వసుధె వసుధ.
0738
సశ్యవృద్ధి, సుఖము, సంపద, సంరక్ష,
వ్యాధిలేమి శోభ వసుధకైదు.
0739
పాటు కొంచెమైన ఫలిత మెక్కువయైన
దేశమునకె వేరు దేశమనఁగ.
0740
పైన జెప్పినట్టి ప్రాభవమెంతున్న
రాజు క్రూరుడైన రాజ్యమగునె?


75. కోట
0741
ముఖ్యమగును కోట ముట్టడించుటకును
ముట్టడింప డాగఁ మూల మదియె.
0742
శుభ్రమైన నీరు, సువిశాలపు స్థలము,
కొండ యడువులుండ కోట యగును.
0743
పోడువు, వెడద, దృఢత బొల్పొంది రిపులచే
గూల్పరాని దగుచు గోట వెలయు.
0744
ద్వార మల్పముగను దండుండ పెద్దదై
దోచగాని దగును దుర్గమన్న.
0745
అరుల కలవిగాక నాహార సామగ్రి
కొరత లేనిచోటు గోట యండ్రు.
0746
సకలముండి దైర్యసాహసంపు ధటుల
గూడుకొన్న దగును కోటయన్న.
0747
ఏవిధముగాను నెదిరి కసాధ్యమౌ
గట్టిపట్టు కోట ముట్టడింప.
0748
ఎదిరి బలము లదర బెదిరించు వీరులు
కుదురుకొన్న చోటు కోటయగును.
0749
ఉన్న తావునందె యన్ని సాములు నేర్వ
శత్రువులను గెల్చు స్థలమె కోట
0750
పై గుణమ్ము లెన్ని బైకొన్న దగునేత
ఉండకున్న కోట దండగగును.


76. ధనార్జనము
0751
లెక్కలేనివాని లెక్కింప జేవెడి
లెక్కధనమ్ముగాక లేదు వేరె.
0752
లేనివాని నెవరు లెక్కింప రెవ్వరు
ఉన్నవాని గూడి సన్నుతింత్రు
0753
ఎట్టి చోటనైన చిట్ట జీకటి బాపు
నారిపోని దీపమగు ధనమ్ము.
0754
ధర్మసమ్మతముగ ధనము సంపాదింప
కామ మోక్షమెల్ల గలుగుగాన
0755
దాన ధర్మములకు తగని సంపాదన
వైభవమ్ము గాదు వగపు దెచ్చు.
0756
ప్రభువు బొక్కసంబు, పన్నును సుంకమ్ము
కప్ప మనగ మూడు మెప్పుగాను.
0757
దయకు బుట్టు బిడ్డ దాక్షిణ్య మనువేర
కలిమి యనెడి దాది వలన పెఱుగు.
0758
కరులబోరు జూచు కరణిని గిరినుండి
చేతనుండ ధనము చేయు పనులు.
0759
ఎదిరి గర్వమణచ బదునైన ఖడ్గమ్ము
ధనముకన్న వేరె ధరణి లేదు.
0760
ధనమువలన గల్గు ధర్మంబు గావున
నీతి దోడఁదాని నిలువుకొన్న.


77. సేన
0761
రథ గజాది యంగ రక్షణతో సేన
వెరిగినపుడె నృపుని వేరు వెరుగు
0762
సేన కొంచెమైన చెదరక బెదరక
నాలమందు నిలచు మూల బలము.
0763
అలలవోలె యెలుక లరచి పైబడనేమి
యురగ ముస్సు రనిన పరుగు లిడును.
0764
చితికి పోక వైరి సేనకు లొంగక
ముందు ముఖమె పట్టు మూలబలము.
0765
ఆలమందు నిలువ కాలపురుషుని యైన
యెదిరి నిలువగలుగు నదియె సేన.
0766
దండుకుండవలయు దక్షత నియమమ్ము
తేలిని తెంపు నాల్గు స్థిరముగాను.
0767
ఎత్తివచ్చువారి యెత్తును గనిపెట్టి
ముట్టడించునదియె ముఖ్యబలము.
0768
శక్తిహీనమైన స్థైర్యమ్ము లేకున్న
శిక్షణమున సేన శ్రేష్ఠమగును.
0769
వెలితి పేదరికము విసుగును లేకున్న
నిజముగాను సేన విజయమందు
0770
బలము గల్గినట్టి భటు లెందఱున్నను
నడుపు నేతలేక చెడును సేన.

78. శౌర్యము
0771
నిలువవలదు మాదు నేతకు నెదురొడ్డి
నిలచినట్టివారి శిలల జూడు.
0772
చెవులపిల్లి గురికి బిక్కు బాణము కన్న
నేన్గు తప్పుకొన్న యీటె మేలు
0773
శౌర్యమందు గొప్ప శౌర్యము పగతుని
దుర్దినంబులందు తోడువడుట.
0774
చేత బరిసెలేని చింతను బోగొట్టె
రొమ్మునగల యీటె రోషముసగి.
0775
అదిరెనేని రెప్ప యెదురైన బఅణమ్ము
లవజయంబున కదె యానవాలు.
0776
గాయపడనిఒ నాళ్ళు గణియించి వీరుండు
వ్యర్థమాయె నంచు వ్యసనపడును.
0777
వీర కంకణమ్ము విభునిచే బడయంగ
ప్రాణమీయ వీరవరుండు గోరు.
0778
రాజు వలదటన్న రణరంగమున నుండి
వీరవరుఁడు రాడు వెన్ను చూసి.
0779
లక్ష్యమునకు నుసురు లక్ష్యంబు జేయని
వీరుఁ దోషములను వెదక రెవరు.
0780
చావుఁ గోరుకొనును సామ్రాట్టు కన్నుల
నీరు గారునట్లు వీరవరుఁడు.

79.  స్నేహము
0781
చేయనేమి కలదు స్నేహమ్ము కన్నను
కర్మకన్న రక్ష కల దదేది?
0782
శుద్ధమైన మైత్రి శుక్లపక్షము బోలు
కృష్ణపక్ష మగును క్లిష్ట మైత్రి.
0783
చదువఁ జదువ నయము సాధ్యమౌ కావ్యము
చేరఁ జేరఁ సుఖము శిష్టజనుల.
0784
నవ్వులాట గాదు నెవ్వరితో చెల్మి
హద్దు మీరఁ గొట్టిదిద్ద నగును.
0785
పూనుకొన్న గాదు పొందిక నొండొరు
లైక్యభావ మందు నమరియుండు.
0786
మైత్రికున్న సొంపు మందహాసము గాదు
విరియవలయు హృదయ వీధియందు
0787
చెడువు రాకఁగాచి చెడినప్పు డతనిని
వీడకుండు టగును తోడటన్న.
0788
అడ్డపడును చేయి గుడ్డ జారినవేళ
నట్టు లొదవు మైత్రి యాపదలను.
0789
సర్వకాలమందు సాధ్యమైనట్లుగా
నాదుకొనుటె మైత్రి కందమగును.
0790
ఇట్టు లితఁడు నాకు నీ రీతి నే నన్న
మైత్రి గొప్ప కపుడె మచ్చ బుట్టు.

80. స్నేహమును గుర్తించుట
0791
చెడువులేదు చెలిమిఁ జేయకపోయిన
కుజనమైత్రి వదలుకొనుట మంచి.
0792
అరసి యరసి స్నేహమాడని దోషమ్ము
చచ్చునట్టి భాధఁ దెచ్చిపెట్టు
0793
గుణము, కులము, బందుగణమును గుర్తించి
చేసినట్టి మైత్రి స్థిరము గాంచు.
0794
మంచి యింట బుట్టి మానంబునకు జంకు
వాని గొనుముదేనినైన నిచ్చి.
0795
దుఃఖ పడఁగ జెప్పి దోషమ్ము ఖండిచి
మార్గ దర్శకమగు మైత్రి గొనుము.
0796
కష్టములను మేలె కలదండ్రు, మిత్రత్వ
మెట్టి దనుచు కొలతఁబట్ట నగును.
0797
లభ్యమైన దన్న లాభమ్ము నొకనికి
దుర్జన సహవాస వర్జితంబె.
0798
పట్టు సడలఁ జేయుఁ బని జేయఁబూనకు
చిక్కులందు జారు చెలిమి వలదు.
0799
ఆదుకొనని స్నేహ మాపద లందున
చచ్చునపుడు దలువఁ జీచ్చుబుట్టు.
0800
గుణము గల్గు చెలిమిఁగొను మంతకైనను
ఇచ్చియైన విడుము తుచ్చ మైత్రి

No comments:

Post a Comment